Tuesday, May 29, 2007

భగవంతుడే నిజంగా నీవాడు (సంసారి - గురువు)

"నేను, నాది అనేది అజ్ఞానం. నిజమైన జ్ఞానం కలిగితే భగవంతుడే సర్వమూ చేస్తున్నాడని, నిజానికి అతడే మన సొంతవాడని, ఈ వస్తు వాహనాలు, బంధువులు మొదలైనవన్నీ అతడికి చెందినవేనని తెలుస్తుంది. అజ్ఞానం వల్ల అంతా నా వల్లనే జరుగుతున్నదని, నేనే చేస్తున్నానని, ఈ గృహారామాలు, వస్తువాహనాలు, సిరిసంపదలు, బంధుమిత్రులు అన్నీ నావేనని అనిపిస్తుంది. ఈ విషయాలను ఒక గురువు తన శిష్యునకు బోధించి, 'నాయనా, ఈ ప్రపంచంలో నీదనేది ఏదీ లేదు. అంతా అశాశ్వతం, అందువల్ల వీటన్నిటియందు మమకారం వదలి నాతోరా, పోదాం!' అని చెప్పాడు. అప్పుడు ఆ శిష్యుడు, 'స్వామీ, నా తల్లి, తండ్రి, భార్య నన్నెంతో ప్రేమిస్తున్నారు. వారినెలా వదలిపెట్టిరాగలను?' అని ప్రశ్నించాడు. గురవుగారు వెంటనే, 'నాయనా! నీవు చెప్పింది నిజమే. కాని ఈ ప్రేమలో, 'నేను, నాది' అనే భ్రాంతివుంది. ఆ భ్రాంతి నీ మనస్సువల్లనే కలుగుతున్నది. నీకొక కిటుకు చెబుతాను. అది చేస్తే, నీ వాళ్ళనుకునే వాళ్ళు నిన్ను ఎంతవరకు ప్రేమిస్తున్నారో నీకే తెలుస్తుంది' అని చెప్పి శిష్యుడికి ఒక మాత్ర ఇచ్చి, 'నీవు ఇంటికి వెళ్ళి ఈ మాత్ర వేసుకో! దాని ప్రభావంవల్ల నీవు చచ్చినట్లుగా పడివుంటావు కాని, నీ చుట్టూ జరుగుతున్నదంతా నీకు తెలుస్తూనే ఉంటుంది. ఎవరు ఏమి మాట్లాడుతున్నా నీకు వినబడుతుంది. అంతేకాక ఆ సమయంలో నేను కూడా మీ ఇంటికి వస్తాను. భయపడకు' అని చెప్పి పంపాడు."

"శిష్యుడు గురువు చెప్పినట్లు చేసి ఒక శవంలాగా పడి పోయాడు. ఇల్లంతా ఏడ్పులతో, పెడబొబ్బలతో నిండిపోయింది. అతడి తల్లి, భార్య, దగ్గర బంధువులు నేలమీద పడి ఏడుస్తున్నారు. ఇంతలో అక్కడికి గురువుగారు ఒక బ్రాహమణుడి వేషంలో వచ్చి, 'అమ్మా! ఎందుకు ఏడుస్తున్నారు. ఏమైంది? అని ప్రశ్నించాడు. 'అయ్యా! నా కొడుకు చనిపోయాడు' అని అతడి తల్లి ఏడుస్తూ బదులుచెప్పింది, ఆ బ్రాహ్మణుడు వాడిని పరీక్షిస్తున్నట్లుగా అతడు చెయ్యి పట్టుకొని చూచి, 'భయం లేదు. ఇతడు బ్రతికేవున్నాడు. ఇదొక రకమైన జబ్బు. ఈ జబ్బుకు నా దగ్గర ఒక మందు ఉంది' అని తన సంచిలోనుండి ఒక మాత్రను బయటకు తీశాడు."

"ఇది చూచి అంతా సంతోషపడ్డారు. స్వర్గమే వాళ్ళింటికి నడచివచ్చినట్లున్నది. ఆ బ్రాహ్మణుడు ఇంకా ఇలా చెప్పాడు. 'మీకో సంగతి చెప్పడం మరచాను. ఈ మందు నీళ్ళలో వేసి కరిగించి, ముందుగా ఎవరో ఒకరు కొంచెం త్రాగి, మిగిలినది ఈ రోగికి ఇవ్వాలి. దానివల్ల రోగి బతికి బయటపడతాడు కాని ముందు త్రాగినవాడు మాత్రం మరణిస్తాడు. ఇక్కడ చూస్తే నాకు ఇతడికి ముఖ్యమైన తల్లి, భార్య కనిపిస్తున్నారు. వాళ్ళలో ఎవరో ఒకరికి ఈ మందు త్రాగడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను.'"

"ఈ మాటలు వినేసరికి ఏడుపులు సర్దుమణిగాయి, ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. అప్పుడు అతడి తల్లి, 'నాయనా! మాది చాలా పెద్దకుటుంబం. నేను చచ్చిపోతే ఈ సంసారాన్ని చక్కదిద్దే వాళ్ళెవరున్నారా అని సందేహిస్తున్నాను' అని చెప్పి ఆలోచనలో పడిపోయింది. తరువాత, అప్పటికప్పుడు తన దురవస్థకు విలపిస్తున్న భార్య అందుకొని, 'అయ్యా! మానవులంతా చివరకు ఏ దాఇ పడతారో, ఆ దారే నా భర్త ఇప్పుడు పట్టాడు. నాకు ఇద్దరు పసిపిల్లలున్నారు. నేనుపోతే వాళ్ళను ఎవరు పోషించి పెద్దిచేస్తారు' అని అన్నది. ఈ మాటలన్నీ శిష్యుడు వింటున్నాడు. ఇంతలో గురువుగారు ఇచ్చిన మాత్ర ప్రభావం తగ్గిపోయింది. తనవాళ్ళనుకునేవాళ్ళు నిజంగా తనవాళ్ళు కారని తెలిసివచ్చింది. దిగ్గున మంచంమీద నుంచి ఇవతలకు దూకి గురువుగారికి నమస్కరిస్తూ, 'స్వామీ! మనమిక వెడదాము. నేను మిమ్మల్ని అనుసరిస్తున్నాను' అని గురువు వెంట నడువసాగాడు. అప్పుడు గురువుగారు అతడితో, 'నాయనా! నీవాడని చెప్పుకునేవాడు నిజంగా ఒకడున్నాడోయి! అతడే భగవంతుడు!' అని చెప్పాడు."

"కాబట్టి మానవుడు పరమాత్ముడొక్కడే తనవాడని నమ్మి, ఆయన పాదపద్మాలయందు భక్తి ఏవిధంగా కలుగుతుందో తెలుసుకొని, ఆ విధంగా నడుచుకోవాలి. నీ చుట్టూవున్న ప్రపంచాన్ని చూస్తున్నావు కదా! అదంతా మూణ్ణాళ్ళ ముచ్చటే. దానిలో సారమనేది లెదు," అని గురుదేవులు షిరిడీ నుండి వచ్చిన ఒక బ్రాహ్మణపండితునితో మాట్లాడుతూ, ఈ కథ చెప్పారు.